: ఎమర్జన్సీ నాటి 'టైం క్యాప్సూల్' సమాచారం లేదట!
ఇందిరాగాంధీ హయాంలో చేబట్టినట్టు ప్రచారం జరిగిన 'టైం క్యాప్సూల్'కు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) స్పష్టం చేసింది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రముఖ రచయిత మధు పూర్ణిమ సమాచార హక్కు చట్టం కింద చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధమైన సమాధానం పంపింది.
అప్పటి ప్రధాని ఇందిర దేశంలో ఎమర్జన్సీ ప్రకటించిన సమయంలో ఈ టైం క్యాప్సూల్ వార్త బాగా ప్రచారంలో వుండేది. దేశ చరిత్రకు సంబంధించిన అనేక ప్రాధాన్యతా విషయాలను మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా అభూత కల్పనలతో రికార్డు చేసి, దానిని చెక్కుచెదరని ఓ లోహపు బాక్సులో వుంచి, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో పూడ్చిపెట్టారనే వదంతులు అప్పట్లో వ్యాపించాయి.
ఇందిర వ్యతిరేకులతో బాటు పలు వార్తాపత్రికలు కూడా దీనికి అప్పట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే, రచయిత మధు పూర్ణిమ మాత్రం ప్రధాని కార్యాలయం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందడం లేదు.