: సచిన్ తో ద్రవిడ్ ఢీ
క్రికెట్ అభిమానులకు పసందైన విందు లభించనుంది. చాలా కాలంగా సరైన వినోదం కోసం ముఖం వాచిపోయిన క్రీడాభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్ టీట్వంటీ లీగ్ మరోసారి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ లీగ్ టీట్వంటీ టోర్నీలో తొలి పోరుకు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్దమవుతున్నాయి. సచిన్, ద్రావిడ్ ను చివరిసారి మైదానంలో చూసే అవకాశం కల్పిస్తున్న సీఎల్ ట్వంటీ లీగ్ కు విశేష ఆదరణ లభిస్తుందని బీసీసీఐ ఆశిస్తోంది.
సచిన్ ఐపీఎల్ నుంచి రిటైర్ కాగా ద్రవిడ్ కూడా ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశముంది. ముంబై, రాజస్థాన్ జట్లు రెండూ ఫైనల్ చేరితే తప్ప.. మాస్టర్ బ్లాస్టర్, మిస్టర్ డిపెండబుల్ లను ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు లభించడం అనుమానమే. ఈ నేపథ్యంలో జరుగుతున్న సీఎల్ తొలి మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇరుజట్ల బలాబలాలను పరిశీలిస్తే రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ముంబై మరోసారి స్టార్ ఆటగాళ్లను నమ్ముకుని సత్తా చాటాలని భావిస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం తమ సమష్టి తత్వాన్ని ముంబైకు రుచి చూపించాలని భావిస్తోంది.
సచిన్, రోహిత్, దినేష్ కార్తిక్, డ్వేన్ స్మిత్, తెలుగబ్బాయి రాయుడులతో ముంబై బ్యాటింగ్ ఛార్ట్ బలంగా ఉండగా మిచెల్ జాన్సన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. వ్యక్తిగత కారణాలతో యార్కర్ స్పెషలిస్ట్ లసిత్ మలింగ గైర్హాజరీ ముంబయి బౌలింగ్ దాడులను కాస్త బలహీనపర్చనుంది. ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్రావిడ్, షేన్ వాట్సన్, రహానే, బిన్నీ, మనేరియా, హాడ్జ్ తో బ్యాటింగ్ పరంగా బలాన్ని సంతరించుకోగా.. షాన్ టైట్, శుక్లా, యాగ్నిక్ లతో బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో క్రీడాభిమానులకు పంసందైన క్రికెట్ విందు లభించడం ఖాయం.
కాగా, ఈ టోర్నీలో పాల్గొంటున్న ఇతర జట్లు ఇవే.. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్, పెర్త్ స్కార్చర్స్, బ్రిస్బేన్ హీట్, లయన్స్, టైటాన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో.