: అక్కడి జైళ్లలో ధూమపాన నిషేధం!


మన జైళ్లలో బీడీ, సిగరెట్లు చక్కగా సరఫరా అవుతున్నాయి. అయితే అక్కడి జైళ్లలో మాత్రం పొగతాగడం నిషేధం. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా జైళ్ల అధికారులు చేశారు. అన్ని జైళ్లలోను పొగతాగడంతోబాటు అన్ని రకాలైన పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిందిగా అధికారులు ప్రకటించారు. అయితే ఇది మనదేశంలోని జైళ్లలో కాదులెండి... ఇంగ్లండ్‌, వేల్స్‌లోని జైళ్లలో...

ఇంగ్లండు, వేల్స్‌లోని జైళ్లలో పొగతాగడంతోబాటు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాలని అక్కడి జైళ్ల అధికారులు ప్రకటించారు. ఈ అలవాటువల్ల జైళ్లలో కాపలా ఉన్న సిబ్బందికి నష్టం కలిగే అవకాశం ఉన్న కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా పొగతాగేవారికన్నా కూడా వారిపక్కనున్న వారు, ఈ పొగ పీల్చడం, అనగా ప్యాసివ్‌ స్మోకింగ్‌ వల్ల ఎక్కువ నష్టానికి గురవుతుంటారు. ఈ కారణంవల్ల తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ సిబ్బంది కోరే అవకాశం ఉండడంతో ఆందోళన చెందిన జైళ్ల శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే పొగాకు ఉత్పత్తులను హఠాత్తుగా మానేయడం వల్ల పలు ఇబ్బందులు కలుగుతాయి. దీంతో కొందరు ఖైదీలు హింసకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నందున వారికి కొన్నాళ్లపాటు నికోటిన్‌ ప్యాచ్‌లు సరఫరా చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా నైరుతి ఇంగ్లండులోని జైళ్లలో 12 నెలలపాటు ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తానికి ఒక అలవాటును మాన్పించడానికి మరోటి అలవాటు చేయడానికి, అలాగే భవిష్యత్తులో పడే పరిహార భారం తప్పించుకోవడానికి జైలు అధికారులు తెగ సతమతమవుతున్నారు...

  • Loading...

More Telugu News