: ఇలా పార్కిన్సన్స్‌ను గుర్తించొచ్చు!
నాడీకణాలు చనిపోవడం పార్కిన్సన్స్ జబ్బుకు దారితీస్తుంది. ఈ జబ్బు ఎవరికి వస్తుంది? అనే విషయాన్ని అంచనా వేయడం కష్టం. అయితే ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్నవారిలో ముందుగానే గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక జీవ సూచికను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవ సూచికను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి గుర్తించడానికి, అది ముదురుతున్న తీరును పసిగట్టడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు చనిపోవడం పార్కిన్సన్స్ జబ్బుకు దారితీస్తుంది. దీన్ని గుర్తించడానికి ప్రస్తుతం అణువైద్య పద్ధతులతో కూడిన ఎంఆర్‌ఐ పరీక్షలను ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా ఖరీదైనవి కావడంతోబాటు వీటిద్వారా వ్యాధి ముదురుతున్న తీరును గుర్తించడం సాధ్యం కాదు. దీంతో ఈ వ్యాధి ముదురుతున్న తీరును గుర్తించడానికి, తేలికైన పరీక్షలకోసం వైద్యులు పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో నాటింగ్ హామ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ వ్యాధి ముదురుతున్న తీరును పసిగట్టడానికి తోడ్పడే ఒక కొత్త జీవసూచికను గుర్తించారు. ఈ జీవ సూచిక ఆరోగ్యంగా ఉన్నవారి మెదడుపై 'కన్నీటి చుక్క'లాగా కనిపిస్తుందని, పార్కిన్సన్స్ బారిన పడ్డవారిలో ఈ సూచిక కనిపించడంలేదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పెన్నీ గౌల్యాండ్ చెబుతున్నారు. ఈ జబ్బును గుర్తించడానికి తాము కనుగొన్న జీవ సూచిక కొత్త పరీక్షల రూపకల్పనకు దారితీయగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి బాధితుల్లో ఈ జీవసూచిక ఎప్పుడు అదృశ్యమవుతుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం అధ్యయనం సాగిస్తున్నామని గౌల్యాండ్ చెబుతున్నారు.