: మన రాష్ట్రంలో మనమే స్థానికేతరులవుతాం: దేవినేని అవినాష్
హైదరాబాద్ లో ఎన్నో సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వెలిశాయని దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ తెలిపారు. విజయవాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 85 శాతం సీట్లు, స్థానికేతరులకు 15 శాతం సీట్లు ఉన్నాయనీ, విభజన వల్ల మన రాష్ట్రంలో మనమే 15 శాతం సీట్లకు పరిమితమైపోతామని, అది భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. 'జీతం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల జీవితం ముఖ్యం' అంటూ ఉద్యమం చేస్తున్న ఉద్యోగులను అభినందించాల్సిన సందర్భం ఇదేనని గుర్తు చేశారు.
రాజకీయ నాయకులు, పార్టీలు పది వేల మందితో సమావేశం పెడితే గొప్పగా చెప్పుకునే వారని, అలాంటిది లక్షలాది మంది ప్రతి సభకు హాజరవుతూ స్వాతంత్ర్య సంగ్రామాన్ని తలపిస్తున్నారని అన్నారు. ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు త్యాగాలు చేస్తే, కేవలం ఓట్లు సీట్ల కోసం రాజకీయ నాయకులు పదవులు వదల్లేకపోతున్నారని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు.