: పల్లం గ్రామస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి: సీఎంకు చంద్రబాబు లేఖాస్త్రం
తూర్పుగోదావరి జిల్లా పల్లం గ్రామంలో ఏడాది క్రితం ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులుగా మిగిలిన మత్స్యకారులకు ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఈమేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.
ఆ అగ్ని ప్రమాదంలో 700 ఇళ్లు కాలిబూడిదయ్యాయని, వారందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పిందని బాబు గుర్తు చేశారు. ఉపాధి కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కొద్ది నెలల తర్వాత మరో గ్రామంలోనూ ఇదే తరహా ఘటన జరిగితే ఇలాంటి వాగ్దానాలే ఇచ్చారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయాలని బాబు తన లేఖలో కోరారు.