: అనైక్యతే తెలుగువారిని ముక్కలు చేస్తోంది: ఎపీఎన్జీవో నేత సాగర్
చెన్నపట్టణాన్ని ఏర్పాటు చేసి, చెన్నై అంటూ తమిళులకి అప్పగించాం అని ఎపీఎన్జీవో నేత సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువారిలో అనైక్యతే జాతి విచ్ఛిన్నానికి నాంది అవుతోందని అన్నారు. కృష్ణా, గోదావరి, తుంగభద్రా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలైన తెలుగువారు తుంగభద్రా నదిని కర్నాటకకు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చెన్నైని తమిళులకి వదిలి, హైదరాబాద్ ను తెలంగాణవారికి వదిలి, రేపు నిర్మిస్తామంటున్న నగరాన్ని ఆ ప్రాంత వాసులకి వదిలి, మరో ప్రాంతానికి పొమ్మంటే అప్పుడు ఎవరు సమాధానం చెబుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కసితో, పట్టుదలతో చదివే విద్యార్థులు తమ భవిష్యత్తేంటి? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
'చరిత్రను చూడండి, ఆంధ్రులు ఎవరో తెలుస్తుంద'ని ఆయన సూచించారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. చరిత్ర పుస్తకాలు చెబుతున్న వివరాలు, రాజకీయనాయకులు చేస్తున్న పనుల వల్ల అవాస్తవాలుగా మారుతున్నాయని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగువాడా? కన్నడిగుడా? అని ప్రశ్నిస్తున్నారని, ఇప్పుడు సమాధానం చెప్పండని ప్రశ్నించారు. ఆయన కన్నడవాడైతే అష్టదిగ్గజాలను ఎందుకు తెలుగువారిని పెట్టుకున్నాడని నిలదీశారు.