: అక్టోబర్ 10న వామపక్షాల బహిరంగ సభ
అక్టోబర్ 10వ తేదీన నాలుగు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది. హైదరాబాద్ సీపీఎం కార్యాలయంలో సమావేశమైన వామపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయించాయి. జాతీయ స్థాయిలో రాజికీయ ప్రత్యామ్నాయ విధానం కోసం ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు.. ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమిస్తారా? లేదా కొనసాగిస్తారా? అన్నది వాళ్ల ఇష్టమన్నారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్యాస్ పై వ్యాట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మీడియా, పాత్రికేయులపై కేసులు పెడుతూ డీజీపీ అధికార దుర్వినియోగం చేస్తున్నారని రాఘవులు ఆరోపించారు. కేంద్రం ప్రతిపాదించిన భూ పరిమితి కుదింపును పార్టీలు వ్యతిరేకించడం సమంజసం కాదని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు.