: ఎంపీలు రాజీనామా చేయాలి.. ఎమ్మెల్యేలు గట్టిగా చెప్పాలి: అశోక్ బాబు
కేంద్రం తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ముందుకు తెస్తే సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా బాటపట్టాల్సిందేనని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. విజయవాడ స్వరాజ్ మైదాన్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్ల పర్యవేక్షణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ వస్తే సీమాంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబించేలా ఎమ్మెల్యేలంతా సమస్యలపై గట్టిగా చెప్పాలని సూచించారు. త్వరలో తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి సమైక్యానికి సహకరించాలని కోరతామని అశోక్ బాబు అన్నారు.
ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శితో చర్చలకు తమను ఆహ్వానించిందని, అయితే తాము ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ రోజు విజయవాడలో, రేపు వైజాగ్ లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలు జరుపుకుంటున్న కారణంగా రాలేమని చెప్పామని అశోక్ బాబు తెలిపారు. అయితే తమ సమాధానంపై ప్రభుత్వం స్పందించాల్సి ఉందని ఆయన చెప్పారు. మరోసారి ప్రభుత్వం చర్చకు పిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమ్మెకు సహకరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.