: 175 కోట్ల సం॥ తర్వాత...
175 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఎలా ఉంటుంది... నిప్పుల కొలిమిలాగా ఉంటుంది... మరి దానిపై జీవం ఉంటుందా... అంటే అసాధ్యం అనే చెప్పవచ్చు. ఎందుకంటే భూమిపై అంతటి వేడిమి పరిస్థితులు ఉంటాయట. ఇప్పటి వరకూ భూమిపై తప్ప మరెక్కడా జీవం ఉన్న జాడలు మనకు కనిపించలేదు. అయితే ఈ జీవం ఎంతకాలం ఉంటుంది... అంటే మరో 175 కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత జీవం అనేది తుడిచిపెట్టుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల సౌరకుటుంబం వెలుపల కనిపించిన గ్రహాలను ఆధారంగా చేసుకుని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో 175 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై జీవం ఉండే అవకాశం లేదని తేలింది.
నక్షత్రం నుండి ఎంత దూరంలో ఉండే గ్రహంపై నీరు ప్రవహించేందుకు అనువైన ఉష్ణోగ్రతలు ఉంటాయో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో పరిశీలించారు. ఈ విషయాన్ని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఆండ్రూ రష్బీ మాట్లాడుతూ సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలను ఆధారంగా చేసుకుని ఆ గ్రహాలు జీవులకు ఆవాసం కల్పించే సామర్ధ్యంపై పరిశోధన సాగించామని, ఆ తర్వాత తారల ఆవిర్భావ నమూనాలను ఉపయోగించి, సంబంధింత గ్రహంపై ఆవాసయోగ్య పరిస్థితులు ఎప్పుడు అంతమవుతాయో లెక్కలు కట్టామని తెలిపారు. ఈ లెక్కల ఆధారంగా ఇప్పటినుండి మరో 175 కోట్ల సంవత్సరాల నుండి 325కోట్ల సంవత్సరాల మధ్య భూమిపై ఆవాసయోగ్య పరిస్థితులు ముగిసిపోతాయని రష్బీ చెబుతున్నారు. భూమి సూర్యుడి ఉష్ణప్రాంతంలోకి చేరిపోతుందని, ఫలితంగా భూమిపై తలెత్తే వేడిమి కారణంగా సముద్రాలు ఆవిరైపోతాయని, జీవం అంతరిస్తుందని, దీనికన్నా ముందే మానవులు, ఇతర సంక్లిష్ట జీవుల మనుగడ ఇబ్బందుల్లో పడుతుందని రష్బీ తెలిపారు. నిజానికి ఉష్ణోగ్రత ఏమాత్రం పెరిగినా మానవ మనుగడ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెబుతున్నారు.