: ఆ మాత్రలు వాడకూడదట
మలేరియా వ్యాధిని నివారించడంలో ఎక్కువగా వాడే ఒక రకమైన టాబ్లెట్లను వాడవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు అమెరికా సైన్యంలోని సర్వోన్నత విభాగమైన సైనిక కమాండోలు ఈ మాత్రల వాడకాన్ని ఆపేయాల్సిందిగా సైనిక వైద్యనిపుణులు సూచనలు ఇచ్చారు. సైనికులు మలేరియా వ్యాధి నివారణకు వాడే మెఫ్లోక్విన్ మాత్రల వాడకాన్ని ఆపేయాలని ఈ మేరకు సైనికులకు సూచించారు.
మలేరియా వ్యాధి నివారణకు వాడే మెఫ్లోక్విన్ మాత్రల వల్ల కొన్ని అరుదైన కేసుల్లో మెదడుకు శాశ్వతమైన నష్టం వాటిల్లే ప్రమాదమున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. అందుకే ఈ మాత్రలను అమెరికా ప్రత్యేక ఆపరేషన్ బలగాలు సైతం వాడకూడదంటూ పేర్కొనడంతో ఈ టాబ్లెట్లపై చాలాకాలంగా కొనసాగుతున్న వివాదంలో ఇది తాజా పరిణామంగా చెప్పవచ్చు. నిజానికి మలేరియా వ్యాధి నివారణకు ఈ మాత్రను 1970 ప్రాంతాల్లో సైన్యం రూపొందించింది. అప్పటినుండి ఇప్పటివరకూ కొన్ని లక్షల సంఖ్యలో మాత్రలను సైనికులు వాడారు. ఈ నేపధ్యంలో మలేరియా వ్యాధి నివారణకు ప్రత్యామ్నాయ ఔషధాలను రూపొందిండంతో ఇవి క్రమేపీ ప్రాధాన్యతను కోల్పోయాయి. ఈ మాత్రలను వాడడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయంటూ గతంలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ చేసిన హెచ్చరికల మేరకు తాజాగా సైన్యానికి ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది.