: మనకు కావాల్సిందే ఇస్తుంది!


మనకేది కావాలో అదే ఇస్తే... ఇక మన సంతోషం చెప్పనలవికాదు... అలాగే ఇంటర్నెట్‌లో మనం ఏదైనా సమాచారం కోసం వెదుకుతున్నప్పుడు మనకు ఏది కావాలో అది మాత్రమే మనముందుకు వస్తే... అబ్బో తెగ సంతోషపడిపోతాం. ఎందుకంటే, మనకు కావాల్సినది వెతుక్కునే సమయం చాలా ఆదా అవుతుంది, పైగా పని కూడా తొందరగా పూర్తవుతుంది. అందుకే అలాంటివి ఉంటే బాగుండు అనుకుంటాం. నిజానికి రోజూ మనం గూగుల్‌, యాహూ ఇలా ఏదో ఒకదానిలో మనం కావాల్సిన సమాచారం కోసం వెదుకుతుంటాం. మనం అలా సమాచారం వెతికే సమయంలో అవసరమైన అంశాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అనవసరమైనవి బోలెడు మన ముందుకు వస్తాయి. అలా కాకుండా మనకు ఏది అవసరమో దాన్ని మాత్రమే మన ముందుంచే సెర్చ్‌ఇంజన్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు.

ఇప్పుడు మనం పలు విషయాలకు సంబంధించిన సమాచారం కోసం వెదుకుతున్న సెర్చ్‌ఇంజన్‌లకంటే కూడా ఇది వంద రెట్లు మెరుగైందని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి జాగర్‌ స్పీడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెదికితే అతనిముందు జాగర్‌ సూపర్‌ కంప్యూటర్‌, చిరుతపులి, కారు ఈ మూడింటికి సంబంధించిన సమాచారమున్న సైట్లు అన్నీ కూడా సదరు వ్యక్తి ముందుకు వస్తాయి. అలాకాకుండా జాగర్‌ సూపర్‌ కంప్యూటరుకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఈ కొత్తరకం సెర్చ్‌ఇంజన్‌ మీ ముందుకు తెస్తుందని, దీనివల్ల సమయం వృధా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలాగంటే ఇంతకుముందు మీరు ఏయే అంశాలకోసం వెదికారు అన్న డేటా అధారంగా సంబంధిత వెబ్‌సైట్లను మాత్రమే అందజేస్తుందట. ఉదాహరణకు కంప్యూటర్‌, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమాచారం కోసం అంతకుముందు ఎక్కువగా వెతికితే జాగర్‌ స్పీడ్‌ అనగానే జాగర్‌ సూపర్‌ కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే మనముందుంచుతుందట. దీనివల్ల సెర్చ్‌ఇంజన్‌పై భారం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News