: వాక్యూమ్‌తో కొత్త చికిత్స


కాళ్లనుండి గుండె వరకూ వ్యాపించి వున్న సుమారు 24 అంగుళాల రక్తపు గడ్డను అమెరికా వైద్యులు వాక్యూమ్‌తో తొలగించారు. దీంతో సదరు రోగికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాల్సిన అవసరం తప్పింది. కాలిఫోర్నియాకు చెందిన టాడ్‌ డన్లవ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిస్సత్తువ, జలుబు వంటి సమస్యలు తలెత్తాయి. సాధారణంగా దీనికి అనుగుణంగా ఏదో ఒక టాబ్లెట్లతో కొందరు గడుపుతుంటారు. అయితే టాడ్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయనకు సీటీ స్కాన్‌ను నిర్వహించిన డాక్టర్లకు ఆశ్చర్యంతో నోట మాటరాలేదు. ఎందుకంటే టాడ్‌కు కాళ్లనుండి గుండె వరకూ సుమారు రెండు అడుగుల పొడవున రక్తపు గడ్డ వ్యాపించి ఉంది. ఇది ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లి ఆక్సిజన్‌ను అడ్డుకుని రోగిని చంపేస్తుందేమోనని డాక్టర్లు భయపడ్డారు. ఈ గడ్డను తొలగించడానికి వైద్యులు టాడ్‌కు రెండు రకాలైన చికిత్సలను సూచించారు. ఇందులో ఒకటి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ... మరోటి శరీరానికి తక్కువగా కోత పెట్టి యాంజియోవాక్‌ అనే పరికరం సాయంతో గడ్డను గుండెనుండి బయటికి లాగేయడం.

అయితే ఇప్పటి వరకూ కాలిఫోర్నియాలో ఒక్కసారికూడా యాంజియోవాక్‌ చికిత్స విజయవంతం కాలేదు. అయినా కూడా టాడ్‌ రెండవ చికిత్సనే ఎంచుకున్నాడు. దీంతో ఆయనకు గతనెల 14న ఈ విధానం ద్వారా చికిత్స చేశారు. ఇందుకోసం ముందుగా వైద్యులు టాడ్‌ అన్నవాహికలోకి కెమెరాను పంపి గుండెను పరిశీలించడం మొదలుపెట్టారు. మెడ ధమని నుండి హోస్‌పైప్‌ చుట్టను గుండెలోకి పంపారు. దీని ఒక అంచును గడ్డదగ్గరకు చేర్చారు. మరో అంచును గజ్జల్లోని సిరలోకి చొప్పించారు. ఈ హోస్‌ను శక్తిమంతమైన గుండె బైపాస్‌ పరికరానికి అనుసంధానించి, సక్షన్‌ను సృష్టించారు. ఫలితంగా ప్రమాకరమైన గడ్డను టాడ్‌ గుండెనుండి బయటికి తీసివేయగలిగామని వైద్యులు తెలిపారు. తర్వాత రక్తంలోని గడ్డను వడపోసి మిగిలిన రక్తాన్ని గజ్జవద్దనున్న నాళం ద్వారా మళ్లీ శరీరంలోకి చొప్పించారు. ఫలితంగా ఆయనకు విడిగా రక్తం ఎక్కించాల్సిన అవసరం తప్పిందట. ఈ చికిత్స తర్వాత వారం రోజులకే కోలుకుని టాడ్‌ ఇంటికి వెళ్లిపోయారట. అదే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసివుంటే ఆయన ఎక్కువ కాలం ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేదని, అలాగే కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టేదని వైద్యులు తెలిపారు. నిజానికి గడ్డను విచ్ఛిన్నం చేయడానికి టీపీఏ అనేమందు సాయంతో చికిత్స చేయవచ్చని, అయితే టాడ్‌ ధమనిలోని గడ్డ మరీ పెద్దదిగా, గట్టిగా ఉండడంతో దీనితో వైద్యం సాధ్యంకాలేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News