: ఫేస్ బుక్ సాయంతో తను చూడని తండ్రి గుర్తులందుకోనున్న కుమార్తె
ఫేస్ బుక్ సామాజిక్ నెట్ వర్క్ ద్వారా ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడెక్కడి వారినో కలుపుతూ ఫేస్ బుక్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. తాజాగా అలాంటి ఉదంతం చోటు చేసుకుంది. 70 ఏళ్ల పెగ్గీ స్మిత్ తన కన్న తండ్రిని ఫొటోలో తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. 1944 లో ఆమె పుట్టేసరికే సైనికుడైన తన తండ్రి యుద్థరంగంలో ఉన్నాడు. ఆ తరువాత నాలుగు నెలలకే మరణించాడు. ఆమెను తల్లే పెంచి పెద్ద చేసింది. 70వ పడిలో ఉన్న పెగ్గీకి ఇప్పుడు హఠాత్తుగా.. తాను పుట్టినప్పుడు తన కోసం తండ్రి రాసిపెట్టిన ఉత్తరం దాంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో తండ్రి గెలుచుకున్న పర్పుల్ మెడల్ లభించనున్నాయి.
ఇన్నేళ్ల తరువాత అవి ఆమెకు చేరనున్నాయి. 14 ఏళ్ల క్రితం డోనా గ్రెగరీ అనే ఆమె తాతలనాటి ఇల్లు సర్థుతుంటే అటకమీద ఒక పెట్టెలో భద్రంగా ఉన్న ఈ లేఖ, పత్రం దొరికాయి. ఆ లేఖలో పేర్కొన్న పాపాయి పెగ్గీ ఎడ్డింగ్ టన్ ను ఎలా పట్టుకోవాలో తెలియక 14 ఏళ్లుగా డోనా వెదుకుతూనే ఉంది. ఎట్టకేలకు ఫేస్ బుక్ సాయంతో ఇద్దరూ అన్ లైన్ లో కలుసుకున్నారు. ఈ వారాంతరంలో డోనా స్వయంగా పెగ్గీ నివసించే నెవాడా వెళ్లి తండ్రి ఆస్తిని ఆమెకు అప్పగించనుంది.