: యూపీఏ పాలన అవినీతిమయం: చంద్రబాబు
యూపీఏ పాలనలో అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, యూపీఏ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయన్నారు. యూపీఏ పాలనా కాలం మొత్తం కుంభకోణాలమయమని మండిపడ్డారు. వైఎస్ జగన్ నిర్వాకం కారణంగా మంత్రులు, ఐఏఎస్ లు జైలు కెళ్లారని, అలాంటి జగన్ ఆధ్వర్యంలోని పార్టీ నీతులు చెబుతోందని అన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు.
అందుకే తెలుగు తమ్ముళ్లంతా కలిసి సమష్టిగా కష్టపడాలని పిలుపునిచ్చారు. అలాగే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్తులో ఎన్నో పార్టీలు వస్తాయి కానీ టీడీపీలా పాలించగలిగే పార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. టీడీపీ ప్రజలకోసమే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. టీడీపీ పార్టీ తెలుగు జాతి కోసం పని చేస్తుందని బాబు తెలిపారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతిలో విద్యేషాలు రెచ్చగొట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు పూర్తిగా కనుమరుగైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణల్లో దేశానికి పీవీ దిశానిర్ధేశం చేశారని బాబు కొనియాడారు. అలాగే ఎన్డీయే పాలనలో రోడ్లు బాగా మెరుగయ్యాయని ఆయన గుర్తు చేశారు.