: ఎన్టీఆర్ చేయలేని పనిని జగన్ చేశాడు: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను ఆ పార్టీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ఆకాశానికెత్తేశారు. ఎన్టీఆర్ కూడా చేయలేని పనిని జగన్ చేశాడని పేర్కొన్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, అప్పట్లో ఎన్టీఆర్.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకని తెలుగుదేశం పార్టీని పెట్టినా, కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చలేకపోయాడని అన్నారు. కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యే స్థితికి చేరుకుందని, అది జగన్ ప్రభావమే అని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ను అంతమొందించే శక్తి జగన్ ఒక్కడికే ఉందని తెలిసే ఆయనపై వేధింపులకు తెరదీశారని పద్మ ఆరోపించారు.
ఇక, సమైక్యాంధ్ర ఉద్యమంపై స్పందిస్తూ.. సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం వైఎస్సార్సీపీ పాటుపడుతుందని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన రేపు సమావేశమై కార్యాచరణపై నిర్ణయిస్తామని వెల్లడించారు. ముందు ప్రకటించినట్టుగా రేపు అసెంబ్లీ వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని పేర్కొన్నారు.