: సన్ రైజర్స్ క్వాలిఫై
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ మెయిన్ డ్రాకు సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. నిన్న రాత్రి మొహాలీలో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్ ను చిత్తు చేశారు. ధావన్ సేన వరుసగా రెండో విజయంతో చాంపియన్స్ లీగ్ బెర్తును మరో మ్యాచ్ మిగిలుండగానే ఖరారు చేసుకుంది. కాగా, గత రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫైసలాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్ మిస్బా (40 బంతుల్లో 56 నాటౌట్) మరోసారి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు.
లక్ష్యఛేదనలో కెప్టెన్ శిఖర్ ధావన్ (59), పార్థివ్ పటేల్ (23) జోడీ మరోసారి శుభారంభం అందించింది. వీరిద్దరికి తోడు డుమినీ (20 నాటౌట్) కూడా రాణించడంతో సన్ రైజర్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసింది. దీంతో, ఆ జట్టు మరో 15 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.
కాగా, నేడు మిగిలిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో సన్ రైజర్స్, ఒటాగో వోల్ట్స్ జట్టుతోనూ.. కందురత మెరూన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ తోనూ తలపడతాయి. ఇప్పటికే రెండేసి విజయాలతో సన్ రైజర్స్, ఒటాగో జట్లు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధించిన నేపథ్యంలో నేటి మ్యాచ్ లకు ప్రాధాన్యత లేకుండాపోయింది.