: అంతర్భాగం వ్యతిరేకంగా తిరుగుతోంది!
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ... సూర్యుని చుట్టూ తిరుగుతోంది... ఈ విషయాన్ని మనం చిన్నప్పుడెప్పుడో చదువుకున్నాం... అయినా ఇప్పుడు మరోసారి గుర్తుచేసుకుందాం... భూమి ఉపరితలం తిరుగుతోంది... మరి భూగర్భం మాటేంటి... అదికూడా భూమిలాగే తిరుగుతోందా... అనేది శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉండేది. దీనిపై పలు పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు భూమి అంతర్భాగం మాత్రం భూమికన్నా వ్యతిరేక దిశలో తిరుతున్నట్టు తేల్చారు.
భూమి ఉపరితలం పశ్చిమ దిశగా తిరుగుతుంటే భూమి అంతర్భాగం మాత్రం దీనికి వ్యతిరేక దిశలో తూర్పు దిశగా తిరుగుతున్నట్టు లండన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చారు. వీరు తమ పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటివరకూ భూమి అంతర్భాగం ఉపరితలం లాగే తిరుగుతుందా... అసలు అంతర్భాగం భ్రమణం చేస్తుందా... వంటి పలు సందేహాలకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానాలను కనుగొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రొసీడింగ్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. భూమి ఉపరితలం పశ్చిమ దిశగా తిరుగుతుంటే భూమి అంతర్భాగం మాత్రం దానికి వ్యతిరేకంగా తూర్పు దిశగా భ్రమణం చేస్తోందట. ఉపరితల భ్రమణంకంటే అత్యంత వేగంగా భూమి అంతర్భాగం భ్రమిస్తోందని, భూ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి గురయ్యే గుణం ఉండడం వల్ల భూమి పైభాగం అంతర్భాగం పరస్పరం వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.