: ఇక కలలు మరవలేరు!
మీకు ఏవైనా కలలు వచ్చాయనుకోండి... నిద్ర లేవగానే వాటిలో చాలా వరకు మరచిపోతారు. కొన్ని కలలు కొంతమేర గుర్తుంటాయి. అదే మీకు సంతోషాన్నిచ్చే కలవస్తే... అది మరచిపోయామనుకోండి... కాస్త బాధకలుగుతుంది. అలాకాకుండా మీ కల కలకాలం గుర్తుండిపోతే... అలాంటి ఒక ప్రత్యేకమైన యాప్ ఇప్పుడు మీకు చేరువకానుంది.
ఇప్పుడు చాలా విషయాలకు యాప్‌లు వస్తున్నాయి. అలాంటి కొత్తరకం యాప్ ఈ కలలను గుర్తుచేసుకునేది. మీరు నిద్రలేవగానే వెంటనే మీకు అప్పటివరకూ వచ్చిన కలను చెప్పి రికార్డు చేసుకునే సౌలభ్యం ఈ యాప్‌లో ఉంది. దీంతో మీ కలను కలకాలం గుర్తుంచుకోవచ్చు. ఇలాంటి కొత్తరకం యాప్‌ను సాంకేతిక నిపుణులు అభివృద్ధిచేశారు. సాధారణంగా మనం ఒక నిర్ణీత వేళకు నిద్రలేవడానికి అలారం పెట్టుకుంటాం. ఉన్నపాటుగా అలారం మోగడంతో ఒక్కసారిగా అందమైన కలనుండి బయటికి వచ్చి అలారంను తిట్టుకుంటాం... ఇంతలో మనకు వచ్చిన కలను గురించి మరచిపోతాం... అందుకే అలాకాకుండా ఈ యాప్ కొత్త తరహాలో పనిచేస్తుందట. మనల్ని నిద్రలేపే పనిలో మన కలకు భంగం కలగకుండా చేయడమే కాకుండా నిద్ర లేచిన తర్వాత మనకు అప్పటి వరకూ వచ్చిన కలను చక్కగా రికార్డు చేసుకోవడానికి వీలుకల్పిస్తుందని దీని తయారీదారుల్లో ఒకరైన లీ సోయిక్ చెబుతున్నారు. ఈ కొత్తరకం అలారం యాప్ పేరు షాడో. పేరే భలేగా ఉందికదూ...!