: మరణానికి చేరువచేసే కొలెస్టరాల్!
కొలెస్టరాల్ పెరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలిసినా... దాన్ని తగ్గించుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. కొందరు ఏదైనా వ్యాయామాలు చేసినా ఆహార విషయంలో మాత్రం కనీస నియమాలను పాటించరు. అలాంటి వారికి ఇదో హెచ్చరిక. గుండెచుట్టూ పేరుకునే కొలెస్టరాల్ వల్ల మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మీ గుండె చుట్టూ ఏ మేరకు కొవ్వు పేరుకుని వుందో తెలుసుకుని దాన్ని బట్టి మీరు ఎంత త్వరలో మరణానికి చేరువ అవుతారో అంచనా వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
కెనడా, వెనిజులా, ఇటలీ, చైనా దేశాలకు చెందిన పరిశోధకులు దీర్ఘకాలంగా కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న సుమారు 109 మంది సీటీ స్కాన్ల ఫలితాలను పరిశీలించి గుండెచుట్టూ పేరుకునే కొవ్వు ఆధారంగా దీర్ఘకాలంగా కిడ్నీజబ్బుతో బాధపడేవారిలో మరణం ముప్పును అంచనా వేయవచ్చని తేల్చారు. ఈ విషయాన్ని గురించి కెనడాలోని ఆల్‌బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన పావోలో రాగి మాట్లాడుతూ కొవ్వు ఎంత ఎక్కువగా పేరుకుంటే మరణం ముప్పు కూడా అంత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతి పది క్యూబిక్ సెంటీమీటర్ల కొవ్వుతో మరణం ముప్పు 6 రెట్లు పెరుగుతుందని రాగి చెబుతున్నారు.