: ఇలాంటి పిల్లలతో జాగ్రత్త సుమా!


మీ పిల్లలు టీనేజ్‌లో ఉన్నారా... అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మీ పిల్లలు చురుకుగా ఉండాలంటే వారికి సంబంధించిన ప్రత్యేక విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి పిల్లలు యుక్తవయసులోకి వచ్చిన తర్వాత వారితో అత్యంత సుకుమారంగా మెలగాల్సి ఉంటుందంటున్నారు పరిశోధకులు. లేదంటే వారు తప్పుదారి పట్టే ప్రమాదంతోబాటు మందకొడిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

టీనేజ్‌లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చీటికి మాటికీ కసురుకుంటూ, తిడుతూ ఉంటే వారిలోని చురుకుదనం క్రమేపీ తగ్గిపోతుందని, పిల్లలు మందకొడిగా తయారవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా తిడుతూ, కసురుకుంటూ ఉంటే పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని, అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ఇందుకోసం కొందరిపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఎదిగే పిల్లలను తిడుతూ, కసురుకుంటూ ఉంటే వారు ఉసూరుమంటూ తయారవుతారని, యుక్త వయసులోకి అడుగుపెట్టిన తర్వాత అప్పుడు ఫలానా తప్పు చేశావంటూ వారిని పదే పదే తిట్టడం మంచిదికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో వెయ్యిమంది తల్లిదండ్రులకు వారు మీ పిల్లలని పాత తప్పులను చూపించి తిట్టడం చేశారా? అనే ప్రశ్న వేశారట. దీనికి 90 శాతం మంది తల్లిదండ్రులు ఏదోఒక రకంగా తమ పిల్లల్ని తిట్టినట్టు అంగీకరించారు. తాము మందలించిన తర్వాత తమ పిల్లల్లో చురుకుదనం తగ్గడాన్ని కూడా గమనించినట్టు తల్లిదండ్రులు తెలిపారట. కాబట్టి టీనేజ్‌ వయసులోని పిల్లలతో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుందని, లేదంటే వారు మానసికంగా ఒత్తిడికి గురవుతారని ఈ పరిశోధన నిర్వహించిన మానసిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ మింగ్‌ తేవాంగ్‌ అంటున్నారు. కోపం వచ్చినపుడు తిట్టకుండా ఏం చేయాలి? అని అడగకుండా వచ్చిన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండంటూ తల్లిదండ్రులకు శాస్త్రవేత్తలు సలహాలనిస్తున్నారు. కోపం బాగా తగ్గింది అనుకున్నాక వారితో మాట్లాడడం మొదలుపెట్టాలని, అలాగే వారికి కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News