: బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేకు గాయాలు
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు గాయపడ్డారు. ఉద్యమానికి మద్దతుగా విజయనగరం జిల్లా కురుపాం నుంచి కూనేరు వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న నాగూరు మాజీ ఎమ్మెల్యే అయిన జయరాజు తానూ ఓ బైక్ ను అధిరోహించారు. అయితే నాగావళి బ్యారేజి వద్ద ఆయన బైక్ కంటే ముందు వెళుతున్న ఓ కారు సడెన్ గా ఆగిపోయింది. దీంతో, జయరాజు బైక్ ఆ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.