: యూపీ అల్లర్ల ఘటనలో నేతలకు అరెస్టు వారెంట్లు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో రెండు వారాల కిందట చోటు చేసుకున్న తీవ్ర అల్లర్ల ఘటనలో ఆ రాష్ట్ర రాజకీయ నేతలకు స్థానిక కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఖాదిర్ రానా, జమీల్ అహ్మద్, నూర్ సలీమ్ రానా.. కాంగ్రెస్ నేత సయ్యద్ ఉజ్జమాన్, బీజేపీ నేత సంగీత్ సామ్ లకు వారెంట్లు జారీ అయ్యాయి. అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చెలరేగుతున్నట్లు ఉన్న ఫేక్ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడన్న ఆరోపణలపై బీజేపీ నేతపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే, ఈ ఆరోపణలను కొట్టిపారేసిన బీజేపీ నేత.. అల్లర్ల సమయంలో తాను తన నియోజకవర్గంలో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదై 48 గంటల్లో అరెస్టు కావాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగలేదని ఆ రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.