: జగన్ కు బెయిల్ వస్తే ఆయన గుండె పగులుతుంది: అంబటి
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తనదైనశైలిలో వాగ్బాణాలు సంధించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకున్న అంబటి.. జగన్ కు బెయిల్ వస్తుందంటే ఆయనకు గుండె పగిలినంత పనవుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు బెయిల్ రాకుండా చేసేందుకు బాబు తన నేతలను ఢిల్లీ పంపి అక్కడి వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు.
చంద్రబాబుకు దమ్ముంటే జగన్ ను ప్రజాకోర్టులో ఎదుర్కోవాలని అంబటి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. జగన్ కు బెయిల్ వస్తే కుప్పంలో కూడా ఓడిపోతానేమో అని బాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇక జగన్ వ్యవహారాన్ని నిర్భయ ఉదంతంతో బాబు పోల్చడంపైనా అంబటి తీవ్రంగా స్పందించారు. బాబు సామాజిక అత్యాచారానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. బాబు వైఖరి చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఆయన బ్లాంక్ చెక్ లాంటి లేఖను ఇచ్చారని అంబటి మండిపడ్డారు.