: దీనివల్లే అధిక బరువు పెరుగుతుంటారు
కొందరు ఎంత తిన్నా కూడా వారికి కడుపు నిండిన భావన రాదు. దీంతో వారు తింటూనే ఉంటారు. ఇలాంటి వారు ఎక్కువగా కొవ్వు పదార్ధాలను ఇష్టంగా తినేవారుగా ఉంటారు. ఇలా కొవ్వు పదార్ధాలను ఎక్కువ ఇష్టంగా తినేవారిలో నరాలకు, మెదడుకు మధ్య సంకేత వ్యవస్థ క్షీణిస్తుందని, దీని ఫలితంగా తమ ఆకలి తీరిందా? లేదా? అనే విషయాన్ని వారు సరిగా గుర్తించలేరని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
కొవ్వు పదార్ధాలు మన ఆరోగ్యానికి కొంత మేర మేలుచేస్తాయి. అయితే అతిగా కొవ్వు పదార్ధాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు మాట పక్కనుంచితే కీడే ఎక్కువగా జరుగుతుంది. అధికంగా కొవ్వు పదార్ధాలను ఇష్టపడి తినేవారిలో మెదడుకు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన నరాల సంకేత వ్యవస్థ దెబ్బతింటుందని న్యూ యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సాధారణంగా కడుపు నిండినప్పుడు దీనికి సంబంధించిన సంకేతాలను కడుపుపైన ఉండే నరాలు మెదడుకు పంపిస్తాయి. దీంతో ఇక తినడం ఆపేయవచ్చని మెదడు మనకు సంకేతాన్నిస్తుంది. కొవ్వు పదార్ధాలను ఎక్కువ ఇష్టంగా తినేవారిలో ఈ నరాలు తమ గ్రాహక సామర్ధ్యాన్ని కోల్పోతాయట. నరాలకు, మెదడుకు మధ్య సంకేతాలు పంపించే వ్యవస్థ దెబ్బతినడంతో అమితంగా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్య ఒకసారి ఏర్పడిన తర్వాత అలాంటి వారు తమ తిండిని తగ్గించుకున్నా వారి నరాల గ్రాహక సామర్ధ్యం మాత్రం మునుపటి స్థాయికి రాదని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ అమందా పేజ్ చెబుతున్నారు. కొవ్వు పదార్థాలను తినేవారిలో మన తిండిని నియంత్రించే లెప్టిన్ హార్మోను కూడా పనిచేయదని కూడా పేజ్ హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా నరాల గ్రాహక సామర్ధ్యం కోల్పోవడం అనేది శాశ్వతమా లేదా కొంత కాలం తర్వాత మళ్లీ నరాలు మునుపటి సామర్ధ్యాన్ని సంతరించుకుంటాయా అనే విషయంలో ఈ అధ్యయనంలో స్పష్టత రాలేదని పేజ్ చెబుతున్నారు.