: మిస్ అమెరికాపై జాతి వివక్ష వ్యాఖ్యలు
పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుంది అమెరికా పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల చిన్న అలికిడి జరిగినా పెద్దన్నయ్య పాత్రను పోషించేందుకు ముందుడే అమెరికా... తన కింద నలుపును మాత్రం చూడలేకపోతోంది. అక్కడున్న జాత్యహంకారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు... నిలువెల్లా జాతి వివక్ష నింపుకున్న అమెరికన్ వైట్స్.
ప్లాస్టిక్ సర్జరీ ఇచ్చే కృత్రిమ అందం కన్నా తల్లిదండ్రులిచ్చే అందమే గొప్పదని చెప్పి సగర్వంగా మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తెలుగమ్మాయి నీనా దావులూరికి జాత్యహంకార సెగ తగులుతోంది. తెల్లతోలు సుందరి కాకుండా వేరే అమ్మాయి మిస్ అమెరికాగా ఎంపిక కాగానే వాళ్లలో విద్వేషం రగిలిపోతోంది. ఆమెకు అందాల సుందరి కిరీటం దక్కగానే ఎవరికి వారు తమదైన శైలిలో తమ ద్వేషాన్ని కక్కుతున్నారు. కొంత మంది దీనికోసం ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు.
అందాల పోటీలో భాగంగా ఆమె బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. దీని గురించి మాట్లాడుతూ... 'నీనా హిందూ మతాన్ని పాటిస్తోందని, కానీ ఆమె చూడ్డానికి అరబ్ టెర్రరిస్టులా ఉందని' కొందరు ట్వీట్ చేశారు. ఇంకొకరు 'నువ్వు టెర్రరిస్ట్ లా ఉన్నావు. వెంటనే న్యూయార్క్ నుంచి వెళ్లిపో' అని రాశారు. మరొకరు '9/4 జరిగి నాలుగు రోజులు అయింది. ఇప్పుడు ఈమె మిస్ అమెరికా అయింది' అంటూ ట్వీట్ చేశారు. మరొకరైతే మరొకడుగు ముందుకేసి 'అల్ ఖైదా తీవ్రవాదుల ఒత్తిడి వల్లే జడ్జిలు ఈమెను సెలెక్ట్ చేశారు' అని ట్వీట్ చేశారు.