: పాక్ లో నాటో దళాల ట్యాంకర్లపై తీవ్రవాదుల దాడి
నాటో దళాలను తమ శక్తి మేరకు ఎదుర్కోవడానికి పాకిస్తాన్ లోని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా నాటోకు చెందిన 20 ఆయిల్ ట్యాంకర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి బెలూచిస్తాన్ రాష్ట్రంలో జరిగిందని పాక్ మీడియా వెల్లడించింది. నాటో దళాలకు ఆయిల్, ఇతర వస్తువులను సరఫరా చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. హబ్ జిల్లాలో రోడ్డు పక్కన ఓ రెస్టారెంట్ దగ్గర ట్యాంకర్లను ఆపి ఉన్న సమయంలో సుమారు 15 మంది ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో ఆరు ట్యాంకర్లలో మంటలు రేగి ఇతర వాహనాలకు వ్యాపించాయి. దీంతో భారీ నష్టం జరిగింది. రెండు రోజుల క్రితం కూడా ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది నాటో ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి.