: రూటు మార్చిన వీరేంద్రుడు


ఫిట్ నెస్ తో పాటు ఫామ్ కూడా కోల్పోయి టీమిండియాకు దూరమైన విధ్వంసకర బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు ఓపెనింగ్ చేయనంటున్నాడు. మిడిలార్డర్లోనే బ్యాటింగ్ చేస్తానంటున్నాడు. ఈమేరకు వీరూ బీసీసీఐకి సమాచారం అందించినట్టు క్రికెట్ వర్గాలంటున్నాయి. సెహ్వాగ్ ను విండీస్-ఏ జట్టుతో జరిగే అనధికార టెస్టు సిరీస్ లో రెండు,మూడు టెస్టులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విండీస్-ఏతో ఈ సిరీస్ లో తలపడే భారత్-ఏ జట్టుకు యువ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లకు గాను వీరూను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓపెనర్ గానే ఎంపిక చేసింది. అయితే, తాను మిడిలార్డర్లోనే వస్తానని వీరూ స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగైతేనే టీమిండియాకు ఎంపికయ్యే చాన్సలుంటాయన్నది ఈ ఢిల్లీ బ్యాట్స్ మన్ వాదన.

టీమిండియా ఓపెనర్లుగా శిఖర్ ధావన్, మురళీ విజయ్ లు పాతుకుపోవడంతో ఇప్పుడు వారిద్దరినీ కాదని వీరూని తీసుకునే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు. దీంతో, వీరూ కన్ను టీమిండియా మిడిలార్డర్ బెర్తుపై పడింది. రైనా అంతంత మాత్రంగా ఆడుతుండడంతో అతనిస్థానాన్ని దక్కించుకోవాలన్నది ఈ రైట్ హ్యాండర్ యోచన. అయితే, విండీస్-ఏ జట్టుపై కనబరిచే ప్రదర్శనే వీరూకి బెర్తు ఎక్కడన్నది ఖరారు చేస్తుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News