: మిమ్మల్ని ఆపదలో కాపాడే ... బచావ్!
ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మహిళలు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడుకునేందుకు ఇతరుల సాయం కోరడానికిగాను ప్రత్యేకమైన యాప్‌లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే నిర్భయ, గో`సురక్షిత్, సెంటనెల్ వంటి యాప్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. వీటికి దీటుగా మరో యాప్ ఇప్పుడు అందుబాటులోకి రానుంది. దీన్ని బెంగళూరుకు చెందిన చిన్మయ అనే మహిళ రూపొందించింది.
మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నా, లేదా ఎవరైనా వ్యక్తులపై మీకు అనుమానం వచ్చినా చాలు, మీరు బచావ్ మీట నొక్కితే చాలు... ఇక మీరు ఏ ప్రదేశంలో ఉన్నారో... అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా ఈ యాప్ మీ సన్నిహితులకు సమాచారాన్ని చేరవేస్తుంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను దృశ్యాలుగా రికార్డుచేసి పంపించడం ఈ యాప్ ప్రత్యేకత. నోకియాలో గతంలో ఉద్యోగం చేస్తున్న చిన్మయ తర్వాత ఉద్యోగం మానేసి సాక్షిన్ టెక్నాలజీ పేరతో సొంత సంస్థను ఏర్పాటు చేసుకుంది. తన స్నేహితురాళ్లతో కలిసి ఈ బచావ్ యాప్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు అనుగుణంగా పనిచేస్తుందని, ఇంకా బ్లాక్‌బెర్రీ, ఐఓస్‌లకు కూడా అనువుగా పనిచేసేలా ఈ యాప్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నామని చిన్మయ చెబుతోంది. ఈ యాప్ మరో ప్రత్యేకతేమంటే మీ స్నేహితులు, సన్నిహితులకు మామూలు ఫోనులున్నా కూడా ఈ ఎస్‌ఎంఎస్‌లను ఎలాంటి సమస్యలూ లేకుండా పంపవచ్చని ఆమె చెబుతోంది.