: వాళ్లను నమ్మవచ్చు
నమ్మకాల విషయంలో మగవారికన్నా కూడా ఆడవారిని చక్కగా నమ్మవచ్చట. మహిళలు నీతి, నిజాయతీ విషయంలో పురుషులకన్నా కూడా మెరుగేనని తాజాగా నిర్వహించిన ఒక అంతర్జాతీయ సర్వే తేల్చిచెప్పింది. మగవారితో పోలిస్తే వీరిని ఎక్కువగా నమ్మవచ్చని, రాజకీయ రంగంలో మరింతగా వీరిపై నమ్మకం ఉంచవచ్చని ఈ సర్వే చెబుతోంది.
అమెరికాలోని రైస్ యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యయన కర్తలు నిర్వహించిన అధ్యయనంలో మగవారికన్నా కూడా మహిళలు ఎంతో నీతి, నిజాయతీతో ఉంటారని తేలింది. గత పదేళ్లలో రాజకీయాల్లో సమాజ సేవకు బదులుగా ఆస్తులను కూడబెట్టుకుని, డబ్బును పోగేసుకున్న మగవారి శాతం పెరిగిందని, అదే విషయంలో ఆడవారు వెనుకబడి ఉన్నారని ఈ సర్వే వెల్లడిరచింది. అలాగే అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరికిన, అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న సంఖ్యకూడా మగవారిదే ఎక్కువగా ఉందట. దీన్నిబట్టి చూస్తే మగవారితో పోలిస్తే మగువల్లో అవినీతికి పాల్పడే స్వభావం తక్కువగానే ఉంటుందని ఈ అధ్యయనాన్ని కర్తలు చెబుతున్నారు. వీరు సుమారు 157 దేశాలనుండి 1999 నుండి 2007 మద్య ఆయా దేశాల్లో బయటపడిన కుంభకోణాలు, రాజకీయ నాయకుల అక్రమాస్తులు, అవినీతి కేసులు ఇలా వివిధ రకాలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని తమ సర్వేని నిర్వహించారు. ఈ సర్వేలో మగవారికన్నా కూడా మగువలపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోవచ్చని తేలిందట.