: ఈ ప్లాస్టిక్ దానికదే అతుక్కుంటుంది!
ప్లాస్టిక్ వస్తువులు విరిగిపోయినా, ముక్కలైనా ఇక పారేయాల్సిందే. వాటిని తిరిగి అతికించడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న పని. మరీ ముక్కలైపోతే ఇక ఆ వస్తువును పారేయాల్సిందే. అయితే ఇలా పగిలిపోయినా, లేదా కోతకు గురైనా కూడా తనకు తానే మరమ్మత్తులు చేసేసుకునే ప్లాస్టిక్ వస్తువులు వస్తే...! వినడానికి చాలా ఆశ్యర్యంగా ఉందికదూ... స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కోత వేసినా కూడా ఎలాంటి తోడ్పాటు అవసరం లేకుండా సొంతంగానే మరమ్మత్తు చేసుకునే పాలీమరును తయారు చేశారు. దీన్ని వేడిచేయాల్సిన అవసరం లేకుండానే దానికదే స్వయంగా తనను బాగుచేసుకుంటుందని చెబుతున్నారు.
గతంలో వెండి నానో పదార్ధాలను పరస్పర బంధాలుగా ఏర్పరచి స్వీయ మరమ్మత్తు చేసుకునే సిలికోన్ ఎలాస్టోమర్లను ఇబాన్ ఆడ్రియోజోలా నేతృత్వంలోని స్పానిష్ శాస్త్రవేత్తలు బృందం రూపొందించింది. అయితే వీటికి వెలుపలినుండి పీడనాన్ని అందించాలి. పైగా దీనిలో వెండిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి పాలీమర్‌ను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ బృందం మళ్లీ పరిశోధనలు చేపట్టింది. తాజాగా ఎలాంటి తోడ్పాటు అవసరం లేకుండా తనకు తానే సొంతంగా మరమ్మత్తు చేసుకునే పాలీమర్‌ను ఈ బృందం అభివృద్ధి చేసింది. ఈ కొత్తరకం పాలీమర్లు తమలో తెగిపోయిన బంధాలను సంస్కరించుకోవడం ద్వారా మరమ్మత్తులు చేసుకుంటాయి. గతంలో ఉత్పత్తి చేసిన పాలీమర్లకు తమను తాము సంస్కరించుకోవడానికి వెలుపలి నుండి ప్రేరణ అవసరం, అనగా కాంతి, వేడి వంటి అంశాలకు వాటిని గురిచేయడం, లేదా ప్రత్యేక వాతావరణ పరిస్థితులను కల్పించడం చేయాల్సి ఉండేది. వీటి స్థానంలో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో కూడిన పదార్ధాలను ఉపయోగించి శాశ్వతంగా పరస్పర బంధనాలు కలిగిన పాలీ (యూరియా`యరేథేన్) ఎలాస్టోమెరిక్ నెట్‌వర్క్‌ను రూపొందించారు. ఈ పాలిమర్లు బ్లేడుతో కోసినా వాటికవే మళ్లీ అతుక్కుంటున్నాయి. ఈ కొత్తరకం పాలీమర్లతో కార్లు, ఇళ్లలో పలు రకాలైన వస్తువులు, విద్యుత్ ఉపకరణాల్లో దీర్ఘకాలం మనే ప్లాస్టిక్ వస్తువులను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.