: తొలి వన్డేలో భారత్-ఏ ఘన విజయం


మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విండీస్-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్-ఏ 77 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్-ఏ విసిరిన 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్-ఏ 235 పరుగులకు ఆలౌటైంది. కరీబియన్ జట్టులో దేవ్ నారాయణ్ (57) అర్థసెంచరీతో రాణించాడు. చివర్లో ఆష్లే నర్స్ (57) పోరాడడంతో భారత్-ఏ గెలుపు కాస్త ఆలస్యం అయింది. భారత బౌలర్లలో నర్వాల్, వినయ్ కుమార్, యూసుఫ్ పఠాన్, రాహుల్ శర్మ తలో రెండు వికెట్లతో రాణించారు.

అంతకముందు భారత్-ఏ ఇన్నింగ్స్ లో కెప్టెన్ యువరాజ్ సింగ్(123) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు యూసుఫ్ పఠాన్ (70 నాటౌట్), మన్ దీప్ సింగ్ (67) కూడా రాణించడంతో భారత్-ఏ 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. కాగా, సెంచరీతో యువీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై ఎల్లుండి జరగనుంది.

  • Loading...

More Telugu News