: డీజిల్, గ్యాస్ ధరలు పెంచాలి.. కానీ ఎలా?: చిదంబరం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.1 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. బడ్జెట్ కు ఒక రోజు ముందుగా నేడు 2012 - 2013 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను చిదంబరం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంటే వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్యాస్ ధరలను అంతర్జాతీయ ధరలతో సమాన స్థాయికి తీసుకెళ్లాల్సి ఉందని (అంటే పెంచడం) చిదంబరం పాత పాటే పాడారు. డీజిల్, గ్యాస్ పై ప్రభుత్వం సబ్సిడీ భరిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో డీజిల్ ధరలు పెంచితే ఆ ప్రభావం వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతుందని స్పష్టంచేశారు.
ద్రవ్యలోటు కూడా ఆందోళన కలిగిస్తోందని చిదంబరం చెప్పారు. అలాగే అంచనా వేసిన దానికన్నా పన్నువసూళ్లు తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఖజానా లోటు ప్రస్తుత ఆర్థిక సంత్సరం చివరి నాటకి (మార్చి ఆఖరుకు) 5.1శాతంగా ఉంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4.8 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. కరెంటు ఖాతా లోటు పెరగకుండా ఉండేందుకు తక్షణం బంగారం దిగుమతులు తగ్గించాల్సి ఉందని స్పష్టం చేశారు. అలాగే ద్రవ్యోల్బణం మార్చి నాటికి 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గుతుందని చెప్పారు.