: ప్రక్రియ అమలులో జాప్యంవల్లే కుట్రలు: కోదండరాం
నలభై రోజులు గడిచినా తెలంగాణ ప్రకటనపై సీడబ్ల్యూసీ తన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేకపోవడానికి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, నేతలు చేస్తున్న కుట్రలే కారణమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ నిజాం కళాశాలలో 'సకల జనుల భేరీ' పేరిట సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు తెలపాలని నిర్ణయించే టీజేఏసీ ఈ సభకు పూనుకుందన్నారు. అందరం సంఘటితంగా పోరాడితే తెలంగాణ తథ్యమవుతుందని చెప్పారు. దాదాపు గంటపాటు జరిగిన టీజేఏసీ సమావేశం అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు.
సీడబ్ల్యూసీ చేసిన తీర్మానం అమలులో జాప్యంవల్లే ప్రకటనను అడ్డుకునే కుట్రలకు అవకాశం ఏర్పడిందన్నారు. తీర్మానం తాత్సారం వల్లనే నేటి పరిస్థితికి కారణమని కోదండరాం చెప్పారు. తక్షణమే క్యాబినెట్ తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే, తీర్మానం అమలుకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేయడంలేదని మండిపడ్డారు. అందుకే ఢిల్లీకి వెళ్లాలని టీ జేఏసీ నిర్ణయించినట్లు వెల్లడించారు.