: ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్నవారికి ఉచిత న్యాయసహాయం: లాయర్ల జేఏసీ
సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని సమైక్య న్యాయవాదుల జేఏసీ తెలిపింది. అనంతపురంలో న్యాయవాదుల జేఏసీ సదస్సు ముగిసిన అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తాము ఉద్యమం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన వద్దన్నదే తమ అభిమతమని చెప్పారు. ఈ నెల 28న హైదరాబాదులో న్యాయవాదుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా అన్ని జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హైదరాబాదులో ఉన్న న్యాయవాదులకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు చెప్పారు.