: రాష్ట్ర నేతల మెడకు కేసుల ఉచ్చు


మన ప్రజాప్రతినిధులు అనేక కేసుల్లో ఇరుక్కుని బయట మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ వీటికి మినహాయింపు కాదు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. కేసులను ఎదుర్కొంటున్న నేతల్లో చిరంజీవి, కేసీఆర్, అసదుద్దీన్ సహా కీలక నేతలు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో మొత్తం 295 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 83 మందిపై వివిధ కేసులు ఉన్నాయి. వీరిలో 54 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అటు 90 మంది ఎమ్మెల్సీల్లో 9 మందిపై పలు రకాల కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభ, లోక్ సభకు ఎన్నికైన 60 మంది నేతల్లో 14 మంది ఎంపీలు వివిధ కేసుల్లో ఉన్నారు.

రాష్ట్రంలో పలు కేసుల్లో ఉన్న 83 మంది ఎమ్మెల్యేల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రముఖులు. వీరిలో ఒక్కొక్కరిపై పది కేసులు ఉన్నాయి. పార్టీల వారీగా వస్తే రాష్ట్రంలో ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఆరుగురిపై కేసులు ఉన్నాయి. బీజేపీ కు నలుగురు ఉంటే వీరిలో ముగ్గురు వివిధ కేసుల్లో ఉన్నారు. ఎంపీల విషయానికి వస్తే 14 మందిలో ముగ్గురు పార్టీ అధినేతలే ఉన్నారు. వీరిలో కడప ఎంపీ, వైస్సార్సీపీ అధినేత ముందు వరసలో ఉన్నారు. అక్రమాస్తులు సహా వివిధ కేసులో జగన్ 16 నెలల నుంచి జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ 10 కేసులు ఎదుర్కొంటున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో నమోదైన ఈ కేసుల దర్యాప్తు ఇంకా పెండింగ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై ఏడు కేసులు ఉంటే అన్నీ దర్యాప్తు దశలోనే ఉండటం గమనార్హం.

ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల విషయానికి వస్తే.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై మూడు కేసులు ఉన్నాయి. ఇవి నంద్యాల వన్ టౌన్, బండి ఆత్మకూరు, కోయిల కుంట్ల పోలీస్ స్టేషన్ లలో ఐపీసీ సెక్షన్ 143, 341,188 కింద ఈ కేసులు నమోదయ్యాయి. వీటి విచారణ కూడా పెండింగ్ దశలోనే ఉంది. రాష్ట్ర మంత్రుల్లో దానం నాగేందర్, శ్రీధర్ బాబు సహా పలువురిపై కేసులు ఉన్నాయి. ఇందులో దానంపై 3, శ్రీధర్ పై 2 కేసులున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, సి. రామచంద్రయ్య పైనా కేసులున్నాయి.

పార్టీల పరంగా చూస్తే.. కేసులు ఎదుర్కొంటున్న నేతల ప్రకారం టీడీపీ మొదటిస్థానంలో ఉంది. ఈ పార్టీకి చెందిన 28 మంది నేతలపై కేసులున్నాయి. కాంగ్రెస్ లో కేసులు ఎదుర్కొంటున్నవారి సంఖ్య 14 కాగా, టీఆర్ఎస్ లోనూ 14 మందిపై కేసులున్నాయి. ఈ వివరాలన్నింటినీ సమాచార హక్కు చట్టం కింద 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ)' అనే స్వచ్ఛంధ సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఇటీవలే కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేతలపై ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని వివిధ జిల్లాల ఎస్పీకి, డీజీపీకి ఈ సంస్థ మార్చిలోనే లేఖలు రాసింది. అయితే, పోలీసుల నుంచి వీరికి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News