: రాజ్ థాకరే కాన్వాయ్ పై రాళ్ల దాడి..అహ్మాద్ నగర్ లో ఉద్రిక్తత
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ ఎస్) నేత రాజ్ థాకరే కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ పై థాకరే విమర్శలకు నిరసనగా మాహారాష్ట్రలోని అహ్మాద్ నగర్ లో మంగళవారం రాత్రి థాకరే కాన్వాయ్ ను ఎన్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయన కాన్వాయ్ పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఎన్సీపీ, ఎంఎన్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
ఈ ఘటనతో బుధవారం ఉదయం అహ్మాద్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రాజ్ థాకరే కాన్వాయ్ పై దాడితో ఆగ్రహించిన ఆ పార్టీ కార్యకర్తలు రాడ్లు, కర్రలు చేతబట్టి ముంబయి పరిసరాల్లోని రెండు ఎన్సీపీ కార్యాలయాలపై దాడి చేశారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ థాకరే పై దాడి చేసిన వారు.. తమ ఇళ్లు కూడా ముంబయిలోనే ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని ఎంఎన్ ఎస్ నేత రామ్ కదమ్ హెచ్చరించారు.