: ముజఫర్ నగర్ హింస వెనుక బీజేపీ, ఎస్పీ: కేంద్రమంత్రి
బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలపై కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజుల కిందట ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక బీజేపీ, ఎస్పీ ఉన్నాయని ఆరోపించారు. కానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని మత ఘర్షణలుగా చిత్రీకరించిందని, వాస్తవానికి అక్కడ జరిగింది మత ఘర్షణలు కాదని ధ్వజమెత్తారు. యూపీలో అల్లర్లకోసం గుజరాత్, మహారాష్ట్ర నుంచి జనాలను తీసుకొచ్చారని, ఆ సమయంలో పోలీసులు కూడా ఉన్నారని వారణాసిలో ఓ మీటింగ్ అనంతరం మీడియాతో అన్నారు. ఆ హింస స్థానిక ప్రభుత్వ సహాయంతోనే జరిగిందని వ్యాఖ్యానించారు. తనకు తెలిసిన దాన్ని బట్టి అక్కడి ఘటనకు బీజేపీయే బయటి నుంచి వ్యక్తులను పిలిపించిందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ, ఎస్పీతో చేతులు కలిపి ఇలా చేసిందన్నారు. మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై ఈ సందర్భంగా మాట్లాడిన బేణీ, ప్రధాని అభ్యర్ధిని ప్రకటించడం బీజేపీ డ్రామాలో భాగమన్నారు. అయితే, దేశానికి తదుపరి ప్రధాని రాహల్ గాంధీయే అవుతారని చెప్పారు.