: నిషేధంపై కోర్టుకు వెళ్లనున్న శ్రీశాంత్?


రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు శ్రీశాంత్ బీసీసీఐ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయనున్నట్లు సమాచారం. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్, అంకిత్ చవాన్ లను జీవిత కాలం పాటు మ్యాచ్ లలో పాల్గొనకుండా బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అలాగే అమిత్ సింగ్ పై ఐదేళ్లు, సిద్దార్థ్ త్రివేదిపై ఏడాది పాటు నిషేధం విధించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, స్పాట్ ఫిక్సింగ్ కేసు కోర్టు విచారణలో ఉండగా, తీర్పు వచ్చే వరకూ బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ వేచి ఉండాల్సిందని శ్రీశాంత్ సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవాని నివేదిక అంతా ఢిల్లీ పోలీసుల వాదన ఆధారంగానే ఉందని, నిషేధంపై శ్రీశాంత్ కోర్టులో సవాలు చేస్తాడని ఆ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, నిషేధం తన కెరీర్ కు పెద్ద అవరోధంగా శ్రీశాంత్ అభివర్ణించాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో తననొక్కడినే లక్ష్యం చేసుకున్నారని వ్యాఖ్యానించాడు. అక్టోబర్ 7న కోర్టు విచారణ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయించుకుంటానని ప్రకటించాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News