: అరుగుదలకు ఉపకరించే అల్లం
మనం తిన్న ఆహారం చక్కగా అరగాలంటే తినేముందు కొద్ది మోతాదులో అల్లం రసం తీసుకుంటే మంచిది. మనం రోజూ వంటకాల్లో అల్లం కొంత మేర వాడుతుంటాం. దీనివల్ల వంటకు రుచి రావడంతోబాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు.
ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది. అలాగే జలుబు, దగ్గు బాధిస్తుంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధలనుండి ఉపశమనాన్ని పొందవచ్చు. డికాక్షన్‌లో కొద్దిగా అల్లం, తేనె, తులసి ఆకులను వేసి కలుపుకుని తాగినా కూడా ఈ బాధలనుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. కొందరికి ప్రయాణాల్లో వాంతులు కావడం జరుగుతుంటుంది. ఇలాంటి వారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కని నోట్లో వేసుకుంటే ఈ సమస్యనుండి బయటపడవచ్చు. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని కణజాలం గట్టిపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి రోజూ కొద్దిమేర అల్లం కూరల్లో తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు.