: పక్షులకు కూడా సంగీతం ఇష్టమే
పశుపక్ష్యాదులను సైతం ఆకట్టుకునేది సంగీతం. ఈ విషయం తెలిసిందే. అయినా మరోసారి శాస్త్రవేత్తలు దీన్ని ఋజువుచేశారు. చిలుకలకు సంగీతమంటే చాలా ఇష్టమని శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసి మరీ చెబుతున్నారు. చిలుకలు సాధారణంగా మన పలుకులను చక్కగా అనుకరిస్తాయి. చిలుక పలుకులు వినడానికి చాలా కమ్మగా ఉంటాయి. అలాంటి చిలుకలు సంగీతాన్ని చక్కగా ఇష్టపడతాయట.
కొందరు శాస్త్రవేత్తలు చిలుకలపై అధ్యయనాన్ని నిర్వహించారు. వాటికి వివిధ రకాల సంగీతాన్ని వినిపించి వాటిని పరిశీలించారు. ఈ అధ్యయనంలో కొన్ని చిలుకలు శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడితే మరికొన్ని పాప్ సంగీతాన్ని ప్రేమగా ఆస్వాదించాయట. ప్రత్యేకమైన గ్రే ప్యారెట్స్‌గా పిలిచే చిలుకల జంటలపై నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. కొన్ని చిలుకలు సంగీతాన్ని వినడమే కాదు, దానికి అనుగుణంగా చక్కగా కదం కలిపాయట. మరికొన్ని గొంతు కలిపాయట కూడా. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయమని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని చిలుకలన్నిటికీ పదేపదే ఒకే రకమైన సంగీతాన్ని వినడం కూడా ఇష్టపడడం లేదని ఈ పరిశోధనల్లోనే వెల్లడైంది.