: దేవుడు నాకిచ్చిన శక్తితో దేశం కోసం శ్రమిస్తా: మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవుడు తనకిచ్చిన శక్తితో పార్టీ కోసం, దేశం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. చిన్న కార్యకర్తగా ప్రారంభమైన తన జీవితం బీజేపీతో ముడిపడి ఉన్నతస్థానానికి చేరుకుందని వివరించారు. సామాన్యుడి ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాంతం శ్రమిస్తానని అన్నారు. వటవృక్షంలా ఎదిగిన పార్టీ నీడలో లక్షలాది మంది ఆశీర్వాదాలతో తానీ స్థాయికి వచ్చానని మోడీ వినమ్రంగా చెప్పారు. కొత్త ఆశలతో పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, మోడీ పార్టీ అగ్రనేత అద్వానీ నివాసానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు అందుకోనున్నట్టు తెలుస్తోంది.