: శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ క్రికెటర్ శాంతకుమరన్ శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఐపీఎల్-6లో ఫిక్సింగ్ అంశం వెలుగులోకి రాగానే బీసీసీఐ తన అవినీతి నిరోధక విభాగం ద్వారా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఈమేరకు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవాని నివేదికను బోర్డుకు సమర్పించారు. శ్రీశాంత్ తప్పిదానికి పాల్పడ్డట్టు ఆయన అందులో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే శ్రీశాంత్ పై జీవితకాలం నిషేధం విధించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్ సహ క్రికెటర్లు చండీలా, చవాన్ లతో కలిసి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు ఢిల్లీ పోలీసులు ఆరోపించడం తెలిసిందే. అనంతరం ఈ ముగ్గురు క్రికెటర్లను అరెస్టు చేయగా, బెయిల్ పై బయటికొచ్చారు.

కాగా, చవాన్ పైనా జీవితకాల నిషేధం విధించారు. ఇక ఫిక్సింగ్ విషయం తెలిసినా బోర్డుకు తెలపనందుకు త్రివేది, అమిత్ సింగ్ లపై ఐదేళ్ళ నిషేధం విధించారు. యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ కు మందలింపుతో సరిపెట్టారు. మరో స్పిన్నర్ అజిత్ చండీలా వ్యవహారంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News