: అనంతలో విద్యార్థుల భారీ ర్యాలీ
సమైక్యాంధ్ర నినాదాలతో అనంతపురం జిల్లా మార్మోగుతోంది. ఈ రోజు సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. జీసస్ నగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ర్యాలీ మధ్యలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది.
కాగా, జిల్లాలో సమైక్య ఉద్యమం 45వ రోజుకు చేరుకుంది. పెనుకొండలో దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నెల 17 వరకు బంద్ కొనసాగిస్తామని ఐకాస నేతలు తెలిపారు. ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాబయ్య చెరువులో జలఘోష చేపట్టారు.