: వేటాడడం వల్ల కాదు... ప్రకృతి ప్రభావం వల్లే!


ఐస్‌ ఏజ్‌ సినిమాలో భారీ ఏనుగు గుర్తుందా... పొడవైన దంతాలతో కనిపించిన ఏనుగులు ఒకప్పుడు నిజంగానే ఉండేవని అవశేషాల ద్వారా బయటపడినా, అవి ఎలా అంతరించాయి? అనే విషయంలో మాత్రం పూర్తి వివరాలు లభించలేదు. మనిషి విచక్షణా రహితంగా వాటిని వేటాడడం వల్లే అవి అంతరించి ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. అయితే మనిషి వేటాడడం వల్ల కాదని, ప్రకృతి ప్రభావం వల్లే అవి అంతరించాయని తాజా పరిశోధనల్లో తేలింది.

బ్రిటన్‌, స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన పరిశోధనల్లో కొన్ని లక్షల ఏళ్ల క్రిందట భూమిపై నివసించిన భారీ ఏనుగులు అంతరించి పోవడానికి ప్రకృతిలో సంభవించిన మార్పులే కారణమని తేలింది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు భారీ ఏనుగులకు సంబంధించిన 300 అవశేషాలను పరీక్షించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ లవ్‌డాలెన్‌ మాట్లాడుతూ తమ పరిశోధనలో ఈ జాతి ఏనుగులు అంత్యదశ లక్షా ఇరవై వేల ఏళ్ల కిందటే మొదలైనట్టు తేలిందని అన్నారు. సరిగ్గా అదే సమయంలో భూమిపైన వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవించాయని, అప్పటివరకూ తేమగా ఉన్న వాతావరణం పొడిగా మారటం మొదలైందని, ఈ సమయంలో భారీ ఏనుగుల సంఖ్య విపరీతంగా పడిపోయినప్పటికీ కొంతకాలం తర్వాత భూమిమీద మరో మంచుయుగం ప్రారంభం కావడంతో కొద్దిసంఖ్యలో ఈ భారీ ఏనుగులు బతికి బట్టకట్టాయని అన్నారు. అయితే మరో ఇరవై వేల ఏళ్ల కిందటే మంచుయుగం పతాకస్థాయికి చేరుకున్న దశలో భారీ ఏనుగులు ఆహారంగా తినే గడ్డి మొలవడం తగ్గిపోయిందని, దీని ఫలితంగా అవి పూర్తిగా అంతరించిపోయాయని లవ్‌డాలెన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News