: షేక్‌ చేస్తేనే ఆగుతుంది


ఒక సినిమాలో హీరోను నిద్రలేపడానికి హీరో తండ్రి తిడుతున్నట్టుగా అలారం మోగుతుంది... అలా మనల్ని నిద్ర లేపడానికి ఒక కొత్తరకం అలారం వచ్చేసింది. అయితే గడియారంలో మాత్రం కాదులెండి. మన సెల్‌ఫోన్‌లో. మనం ఫలానా టైంకి నిద్ర లేవాలనుకుంటాం... దానికి అనుగుణంగా మన గడియారంలో అలారం పెట్టుకుని నిద్రపోతాం. తీరా అలారం మోగగానే లేచి ఆపేసి మళ్లీ ముసుగుతన్ని పడుకుంటాం. దీంతో మనం లేవాలనుకున్న సమయానికి నిద్రలేవలేకపోవడం వల్ల పనులు ఆలస్యం కావడం... దాని ఫలితం మన రోజువారీ అన్ని పనులమీదా పడుతుంది. అయితే ఈ కొత్తరకం అలారం మీరు నిద్ర లేచేదాకా ఆగదట. మీరు నిద్ర లేచామని దానికి తెలిసేలా చేస్తే తప్ప అది ఆగకుండా మోగుతూనే ఉంటుందట.

ఇప్పుడు చాలా విషయాలకు యాప్‌లు వచ్చేస్తున్నాయి. మనల్ని కావాల్సిన సమయానికి నిద్ర లేపడానికి కూడా యాప్‌లు వచ్చేశాయి. మనం ఎంత సమయానికి నిద్ర లేవాలి? అనే విషయాన్ని ఈ యాప్‌లో సెట్‌ చేసుకుంటే చాలు ఆ సమయానికి మనల్ని తన అలారంతో నిద్ర లేపుతుంది. దీనిపేరు వేక్‌ ఎన్‌ షేక్‌. పేరుకు తగ్గట్టుగానే మనం నిద్ర లేచినట్టు మన ఫోన్‌కు తెలిసేలా మన ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితేనే సదరు అలారం ఆగుతుందట. దీన్ని మన ఫోన్‌లో ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుని, అలారం మోగాల్సిన సమయాన్ని నిర్దేశించుకుంటే చాలు. ఇక మనం లేచేదాకా ఆగకుండా మోగుతూనే ఉంటుందట. ఇక విధిలేక మనం నిద్ర లేవక తప్పదు... లేచిన తర్వాత మన ఫోన్‌ను గట్టిగా ఊపకా తప్పదు. అందాకా ఈ అలారం ఆగదు. మనం నిద్రలేచి అందులోని షేక్‌ మీటర్‌ పూర్తిగా నిండేదాకా మన ఫోన్‌ను ఊపితే తప్ప దీని అలారం మోత ఆగదట. అంతేకాదు మనం ఎన్నిసార్లు సరిగ్గా సమయానికి నిద్ర లేచామనే విషయాన్ని కూడా ఇది నమోదు చేసుకుంటుందట. వరుసగా మూడురోజులు సరిగ్గా సమయానికి నిద్రలేస్తే హ్యాట్రిక్‌ అనీ, పదిరోజుల పాటు లేస్తే షేక్‌ డామినేషన్‌ అని ఇది మనకు కితాబులిస్తుందట. ఇందులో క్విక్‌ న్యాప్‌ అనే మరో అవకాశం కూడా ఉంది. దానిప్రకారం మనం ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నామో నిర్దేశిస్తే దానంతట అదే అలారం సెట్‌ చేసుకుని ఆ సమయానికి మోగుతుందట.

  • Loading...

More Telugu News