: నాసా కొత్త ప్రయోగం
మానవ రహిత విమానాలను ఒకవైపు తపాలా శాఖ కొరకు వినియోగించడానికి ఇటీవలే ఒక దేశం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు నాసా ఈ విమానాలను వాతావరణ అధ్యయనానికి వినియోగించాలని ఆలోచిస్తోంది. వీటిని ఇప్పటి వరకూ కేవలం నిఘా అవసరాల కోసం సైన్యం ఉపయోగించేది. ఇప్పుడు వీటి సేవలను పలు రంగాలకు విస్తరింపజేయాలని నాసా భావిస్తోంది.
మానవరహిత విమానాలను (డ్రోన్ లు) నిఘా అవసరాల కోసం ఇప్పటి వరకూ సైన్యం ఉపయోగించేది. వీటిని అట్లాంటిక్ సముద్రంపై ఏర్పడే తుఫాన్లను పరిశీలించడానికి నాసా ఉపయోగించనుంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన పాల్‌న్యూమన్ మాట్లాడుతూ కొన్నిరకాల తుఫాన్లు అత్యంత వేగంగా తీవ్రతరంగా ఉంటాయి. మరికొన్ని మామూలుగా ఉండిపోతాయి. ఇలా తేడాలు ఉండడానికి కారణాలేమిటి అన్నది పరిశీలించనున్నామని, గత ఇరవై ఏళ్లుగా జరిపిన పరిశోధనల ద్వారా తుఫాన్లు ఎలా ఏర్పడుతున్నాయన్న అంశంలో గణనీయమైన పురోగతి సాధించామని, కానీ తుఫాన్ల తీవ్రతను అంచనా వేయడంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయామని తెలిపారు. ఈ నేపథ్యంలో తుఫాన్ల తీవ్రతను అంచనా వేయడంపై ప్రస్తుతం దృష్టి సారించామని అన్నారు. తుఫాన్ల తీవ్రతకు సంబంధించి కచ్చితమైన సమాచారం లభిస్తే దానివల్ల తీరప్రాంత ప్రజలకు మరింత మేలు చేసినట్టు అవుతుందని, ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో కూడా ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని న్యూమన్ తెలిపారు.