: మంచి సీఈఓ కావాలంటే...
మీరు మంచి సీఈఓ కావాలనుకుంటున్నారా.... అయితే చక్కగా పలు భాషా పాండిత్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఇక మీరే మంచి సీఈవో కావచ్చు. భాష తెలిస్తే మంచి సీఈఓ ఎలా అవుతామనుకుంటున్నారా... అంతేమరి భాషలు బాగా నేర్చుకున్న వారు సీఈఓ పదవిలో చక్కగా రాణిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే, పలు భాషలను అభ్యాసం చేసేటప్పుడు ఒకభాషకు, ఇంకొక భాషకు పరిజ్ఞానానికి సంబంధించి మన మెదడును చక్కగా నియంత్రించుకోవడం మనకు అలవడుతుంది. దీంతో ఇదే విధానాన్ని మన కార్యక్రమాల నిర్వహణలో కూడా ఉపయోగిస్తామని, కాబట్టి బహుభాషా పరిజ్ఞానం కలిగిన వారు చక్కటి సీఈవోలుగా రాణిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
పెన్సిల్వేనియా రాజ్య విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒకటికన్నా రెండు భాషలు తెలిసిన వారు చక్కటి సీఈవోలుగా రాణిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే ఒక భాషకన్నా రెండు మూడు భాషలు మార్చి మాట్లాడే సమయంలో దానికి తగ్గట్టుగా మీ మెదడును మీరు నియంత్రించుకోగలరట. అంటే ఆయా భాషలకు సంబంధించిన జ్ఞాపక కేంద్రాలను మీరు సునాయాసంగా మార్చుకోగలరట. ఇది వారి మెదడు కండరాలకు మంచి అభ్యాసాన్ని ఇవ్వడంతోబాటు చక్కటి నిర్వహణా సామర్ధ్యాన్ని సొంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండు భాషలు తెలిసిన వారికి ఏ ఒక్క భాషలోను పూర్తి సామర్ధ్యం ఉండదని వారిపై ఇంతకాలం కాస్త చిన్నచూపు ఉండేదని, కానీ రెండు భాషల్లో పట్టుండడం వల్ల అలాంటి వారికి వారి భాషా పాండిత్యం ఏమాత్రం చెడు చేయదని, పైగా ఎంతో మేలు చేస్తుందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రనిపుణుడు జుడిత్ ఎఫ్.క్రాల్ చెబుతున్నారు.