: కొండారెడ్డి బురుజు సాక్షిగా సత్యవాణి!


కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో మహిళా గర్జన జరిగింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని మహిళలు నినదించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గర్జించారు. ఈ సందర్భంగా హిందూవాహిని సభ్యురాలు సత్యవాణి మాట్లాడుతూ, ఎల్బీస్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవోల సభలో తాను మాట్లాడిందంతా దైవేచ్ఛ అని అన్నారు. తాను మాట్లాడే షెడ్యూల్ లేకపోయినా తనను రెండు నిమిషాలు మాట్లాడమన్న నిర్వాహకుల కోరిక మేరకు మాట్లాడానని తెలిపారు.

అక్కడ తానేమి మాట్లాడానో ఇప్పుడు గుర్తులేదని ఆమె అన్నారు. సభకు ఏ గేటులోంచి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు మహిళా ఉద్యోగులు చేయిపట్టుకుని తనను తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వివేకానందుడు ఎలా వెళ్లాడో అలాగే జరిగిందని అన్నారు. ఎన్నికలప్పుడు స్వీటుస్వీటుగా ఓట్లు వేయించుకున్న రాజకీయ నేతలు ప్రస్తుతం ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. నెలన్నరగా ఆందోళనలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు.

ప్రజలేం చేయలేరన్న ధీమాతోనే రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకోకుండా 'అమ్మ'కు పల్లకీమోస్తున్నారని విమర్శించారు. 'బలవంతమైన సర్పము చలి చీమల చేతజిక్కి చావదె సుమతీ' అన్నట్టు కోట్లాది సీమాంధ్రుల తీర్పుకు తలతిరగడం ఖాయమన్నారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోని ప్రభుత్వమెందుకు? అంటూ ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News