: సిరియాపై దాడి చేయకండి: రష్యన్ పార్లమెంట్
సిరియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో... దాడులను నివారించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నం చేస్తోంది. సిరియాపై సైనిక దాడి జరగకుండా చూడాలని రష్యా పార్లమెంటు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ సిరియాపై దాడి జరిగితే తీవ్ర విధ్వంసం జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అణు ధార్మికత, రసాయన ఆయుధాల ప్రభావంతో సిరియాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా మరింత మంది పౌరులు చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఇది సిరియాలో దారుణమైన మానవ విధ్వంసానికి కారణమవుతుందని తెలిపింది.
దాడులను నివారించేందుకు అమెరికన్ కాంగ్రెస్ తో పాటు అన్ని దేశాల పార్లమెంటులూ దీనికి అనుకూలంగా ఓటు వేయరాదని రష్యా పార్లమెంటు విజ్ఞప్తి చేసింది. కేవలం శాంతియుత మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించాలని సూచించింది. సైనిక దాడికి పాల్పడటం అనేది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. వేసవి సెలవుల తర్వాత రష్యన్ పార్లమెంట్ (డ్యూమా) ఆమోదించిన మొదటి తీర్మానం ఇదే.